Dec 9, 2025

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష


ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత్వంలో స్పష్టత ఉంటుంది. ఆయన కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ. తెలుగు భాషలోని పదాలతో ఆడుకుంటారు. సరళమైన భాషలో చక్కటి అర్థం వచ్చే విధంగా కవిత్వం రాస్తారు.  మూడు దశాబ్దాలుగా ఆధునిక భావాలతో, సామాజిక స్పృహతో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని ప్రజా చైతన్యం కోసం ఎదురీదుతున్నారు.  మధు గతంలో భారతీయ ధర్మ విశ్లేషణ(2003), నవశకం(2006), రైతు సమరభేరి(2020,2021), గమనం(2021), సంఘర్షణ (2023)అనే అయిదు కవితా సంకలనాలు అందించారు. పుస్తకాలకు కాలం చెల్లిందనుకుంటున్న రోజుల్లో 2020లో వచ్చిన ఆయన ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి 2021లో రెండవ ముద్రణ కూడా జరిగింది. అంటే, ఆయన కవిత్వంలో ఎంత పట్టు, పవర్ ఉందో అర్థమవుతోంది. మధు  ఆరవ కవితా సంకలనం ‘ఎదురీత’ని    మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఇటీవలే మంగళగిరిలో ఈ సంకలనం ముద్రణ దాత ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు  నన్నపనేని నాగేశ్వరరావు  ఆవిష్కరించారు.

ఈ కవితా సంపుటిలోని 55 కవితలలో   విభిన్న పార్శ్వాలను స్పర్శించారు. చదవడం మొదలుపెడితే, చివరి వరకు పుస్తకం మూయలేరు. పాఠకులను అంతగా కట్టిపడేశాలా ఈ కవితలు ఉన్నాయి. మధుకు జీవితం పట్ల, కవిత్వం పట్ల స్పష్టత ఉండటంతో ఆయన రాసే కవిత్వం పాఠకుల మనసుకు సూటిగా తగులుతుంది.  ప్రజల పక్షం, బాధితుల పక్షం నిలిచిన కవి. మధు  ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, ప్రభుత్వాలపైనే తిరుగుబాటు కవిత్వం రాయగల ధైర్యవంతుడు, ధీశాలి. మధు కవిత్వం ఎంత మక్కువతో రాస్తారో, ఉద్యోగం కూడా అంతే నిజాయితీ,  నిబద్ధత, అంకితభావంతో చేస్తారు. తన భావాలు చక్కటి భాషతో సూటిగా చెప్పగల సత్తా ఉన్న  కవి. ఈ సంకలనం మొదటి పేజీలో భారత రాజ్యాంగ ప్రవేశికకు స్థానం కల్పించారంటే,  భారతీయ పౌరుడుగా మధు ఎంత బాధ్యతగా ఉంటారో తెలుస్తోంది.  గుడి కప్పులు ధగ ధగ మెరుస్తుంటే - బడి కప్పులు పెచ్చులూడి పడుతున్నాయి... గుళ్ల మీద చూపించిన శ్రద్ధ మనం బడులమీద చూపించడంలేదన్న బాధ వ్యక్తం చేశారు మధు. ఈ కవిత  చదువుతుంటే  ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటి, నిర్మాత  మంచు లక్ష్మి గుర్తుకు వస్తారు.  ‘‘కట్టాల్సింది దేవాలయాలు, చర్చిలు, మసీదులు కాదు... విద్యాలయాలు, వైద్య శాలలు’’ అని  రామ్ గోపాల్ వర్మ అన్నారు.  మంచు లక్ష్మి  తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో పది, పది ప్రభుత్వ పాఠశాలలను  దత్తత తీసుకున్నారు.  అత్యధిక మంది దాతలు అలా ముందుకు వచ్చి బడులను బాగుచేయాలన్నదే మధు కోరిక. 

తమ పెంపుడు కుక్క ‘మిలో’ మరణించినప్పుడు  మధు రాసిన 8 పేజీల కవిత పాఠకుల కంట తడిపెట్టిస్తోంది.  పెంపుడు కుక్కలతో ఆ ఇంటి వారి అనుబంధం, వాటి చేష్టలు, అల్లరి, అరుపులు,  చూపులు,  ప్రేమ, వాటి ప్రవర్తనా తీరు..., వాటిపై  ఇంట్లో వారు చూపించే ప్రేమ, అవి మరణించినప్పుడు వారు పడే బాధ... చాలా అద్బుతంగా రాశారు. దానిని అందరూ చదివి తీరవలసిందే. ముఖ్యంగా జంతు ప్రేమికులకు, కుక్కలను పెంచుకునేవారి మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది.  అలాగే, కల్తీ కల్తీ  కల్తీ - ఇందుగలదందులేదన్న కల్తీ... అని మనిషి జీవితంలో అడుగడుగునా జరిగే కల్తీల గురించి ‘సమాధి’ అనే కవిత అద్భుతంగా రాశారు. సజావుగా సాగే జీవితం తలక్రిందులైతే, కాలానికి ఎదురీది, తనని, తన చెల్లిని పెంచిన తీరు ద్వారా అమ్మ గోలి పార్వతీ దేవే తన ఎదురీతకు స్ఫూర్తి అని చెప్పడంలోనే మధు సంస్కారం తెలుస్తోంది. మంగళగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలిగా ప్రజాసేవలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన దివంగత నన్నపనేని లక్ష్మికి ఈ పుస్తకం అంకితం ఇవ్వడం ద్వారా ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం అర్థమవుతోంది.  మరో కవితలో ప్రశ్నించడం మరిచామని ప్రశ్నార్థకమయ్యావా ప్రజాస్వామ్యమా!.. అని అంటారు.  గొంతు మెదపక ప్రశ్నించక, ప్రతిధ్వనించక కలహించక కూర్చుంటే - నువ్వు మాయం నేను మాయం!!... అని హెచ్చరిస్తారు. తడి గుడ్డతో గొంతులు తెగుతుంటాయి-తడి గుడ్డ వేసుకుని వేడుక చూస్తున్నంత కాలం... అని మరో హెచ్చరిక చేశారు. అంతేకాకుండా, తడిగుడ్డ తొలగించి-కళ్లు తెరిచి - కన్నెర్ర చేద్దాం రారండి!! అని పిలుపు ఇచ్చారు. అదే మధు ప్రత్యేకత. ఒకటికి మరొకటి జత చేరనిదే ఒకటి   లేనేలేదు - పరుగు పందెంలో ఒకటో స్థానానికి రెండు కాళ్లు...,  మనిషి మనిషికీ మతం మత్తు-సందు సందుకీ కులం కిక్కు...,  పీడితుల నడుమ ఐక్యత సాధించనంతవరకూ పీడకునిదే గెలుపు.... ఇలా సాగుతుంది మధు కవిత్వం.            

‘ఎదురీత’ పుస్తకం వెల : రూ.150

కవి గోలి మధు సెల్: 9989186883

ప్రతులకు : 9848199098

                                      సమీక్షకులు : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

Dec 1, 2025

కలిమిశ్రీ సేవలు గుర్తించిన మంగళగిరి సాహితీ కళావేదిక


ప్రముఖ కార్టూనిస్టు, మల్లెతీగ మాసపత్రిక సంపాదకుడు, మిత్రుడు కమిలిశ్రీ(కలిమికొండ సాంబశివరావు)కి ఈ నెల 28వ తేదీ రాత్రి మా ఊరు మంగళగిరిలో మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. కలిమిశ్రీ సాహితీ సేవలను మంగళగిరి సాహితీ కళావేదిక  గుర్తించి పాతమంగళగిరిలోని కామ్రేడ్ పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయంలో  సన్మానించడం సముచితం. నాకు చాలా సంతోషం కలిగించింది.   కలిమిశ్రీ ఇల్లు ఓ సాహిత్య కుటీర పరిశ్రమ. అతను, అతని భార్య, కుమారుడు... అందరూ తెలుగు సాహితీవేత్తల సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి నిరంతరం కృషి చేస్తుంటారు. కవితలు, కథలకు సంబంధించి వందల పుస్తకాలకు, పలు మాస పత్రికలకు ఆయన అద్వితీయంగా రూపకల్పన చేశారు. అతని ఇల్లు ఓ కుటీర పరిశ్రమ అని ఎందుకన్నానంటే, ఓ కవి లేక రచయి కవితలు, కథలు రాసిన పేపర్లు ఆయనకు ఇస్తే చాలు. పుస్తకావిష్కరణలు జరిపించేస్తారు. డీటీపీ, ప్రూఫ్ రీడింగ్ దగ్గర నుంచి కవర్ పేజీ డిజైన్, పుస్తకం డిజైన్, ఫొటోల కూర్పు, ముందు మాటలు, ముద్రణ ... ఆ తర్వాత ఆ పుస్తకం ఆవిష్కరణల వరకు ఆయన, ఆయన కుటుంబ సభ్యులే చూసుకుంటారు. ఈ రకమైన సాహితీ సేవ మాసపత్రికల నిర్వాహకులకు, కవులు, రచయితలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది.  తన కవితలు, కథల కాగితాలు ఇచ్చిన కవులు, రచయితలు, తర్వాత తమ పుస్తకాలను చూసి ఎంత మురిసిపోతారో, ఎంత ఆనందిస్తారో వారి మొఖాలను చూస్తే అర్థమవుతుంది. పుస్తకం ఎలా ఉండాలో ఆయనకు చెప్పవలసిన అవసరంలేదు. చెప్పినా, అంతకు మించి ఆకర్షణీయంగా ఆయన పుస్తకాన్ని తీర్చిదిద్దుతారు. కలిమిశ్రీకి సాహిత్యంతోపాటు సామాజిక అంశాలు, పుస్తక రూపకల్పనపై అవగాహన ఎక్కువ.  కలిమిశ్రీకి సాహిత్యంపై ఉన్న ప్రేమతోనే ఇదంతా సాధ్యమవుతోంది. చూసేవారికి ఇదంతా ఓ వ్యాపారంలా అనిపిస్తుంది. వాస్తవానికి ఇది వ్యాపారమే. అయితే, కలిమిశ్రీ సాహితీ ప్రియుడుగా, శ్రామికుడిగా ఉన్నత శిఖరాలకు చేరారు.  తెలుగు సాహితీ ప్రపంచం గుర్తించుకోతగిన గొప్ప సాహితీ సేవకుడు కలిమిశ్రీ. వందల పుస్తకాలను అన్ని హంగులతో ముద్రించి, ఆవిష్కరణలు చేయించిన కలిమిశ్రీ  వ్యాపారవేత్తగా మాత్రం ఎదగలేకపోయాడు. చేసిన పనికే ఆయనకు డబ్బులు అడగడం తెలియదు. ఇక వ్యాపారవేత్తగా ఏమి ఎదుగుతారు?.   

‘కలిమి’ లేని కలిమిశ్రీ అని మంగళగిరి బుద్ధ విహారం అధ్యక్షుడు కృష్ణార్జున రావు గారు రాశారు. సాహితీ వేత్తగా, సాహితీ సేవకుడిగా, సాహితీ పారిశ్రామికవేత్తగా ఆయన  ఎంత ఉన్నతుడిగా ఎదిగినా, ఆర్థిక వ్యవహారాలలో కలిమిశ్రీ చాలా పూర్. అందుకు ఓ ఉదాహరణ చెబుతాను. ‘‘కలిమిశ్రీకి చేసిన పనికి డబ్బు అడగడం తెలియదు’’ అని దివంగత రిటైర్డ్ డీఎస్పీ బొప్పన విజయకుమార్ నాకు ఒకసారి చెప్పారు. విజయకుమార్ గారి ‘రేపటి కోసం’ మాసపత్రిక నిర్వహణా వ్యవహారాలన్నీ కలిమిశ్రీ చాలా కాలం చూశారు. విజయకుమార్ గారు చెప్పిన విషయం నాకు కూడా స్వానుభవం అయింది. నా ‘ప్రజారాజధాని అమరావతి’ పుస్తకం రూపకల్పన అంతా ఆయనే చేశారు. నేను మేటర్, ఫొటోలు మాత్రమే ఇచ్చాను. ఆయన పనితనం నాకు తెలుసు. అందువల్ల ఆయనకు నేను ఏమీ చెప్పలేదు.  కవర్ పేజీ నుంచి ఏ ఫొటో ఎక్కడ పెట్టాలో అంతా ఆయనే చూసుకుని, అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రింటింగ్ నేనే చేయించుకున్నాను.  నా పుస్తకం అచ్చయి వచ్చిన తర్వాత, దానిని చూసి అందరి రచయితలలానే నేనూ చాలా ఆనందించాను. అంతవరకు ఒక ఎత్తు. నా పుస్తకం ఆవిష్కరణ జరిగిన నెల తర్వాత కూడా ఆయన చేసిన పనికి నన్ను డబ్బులు అడగలేదు. అప్పటికీ, ‘‘ఎంత ఇవ్వమంటారు’’ అని నేనే అడిగాను. అతను అడిగిన అమౌంట్ విన్న తర్వాత, విజయకుమార్ గారు చెప్పినది నిజమేనని నిర్ధారణకు వచ్చాను. అతను అడిగినదానికంటే, నేను ఎక్కువ అమౌంట్ ఇచ్చాను. అలాంటి కలిమిశ్రీ వ్యాపారవేత్తగా ఏమి ఎదుగుతారు!  ఆయన తన వృత్తిలో ఎంత దిట్టో, జీవన శైలిలో అంత సింపుల్‌గా ఉంటారు. ఆయన మాటతీరు, నవడి కూడా అంతే ఉంటుంది. తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు. ఆయన దృష్టిలో పని అంటే, అందరి సాహిత్యానికి మెరుగులు దిద్దడమే!.  తెలుగు సాహిత్యానికి వివిధ రూపాలలో ఇంతటి సేవచేసినవారు, చేస్తున్నవారు కలిమిశ్రీ ఒక్కరేనని నా అభిప్రాయం. విజయానికి శ్రమించడం ఒక్కటే మార్గం అన్నది కలిమిశ్రీకి అక్షరాల వర్తిస్తుంది. 

ఈ నెల 22, 23 తేదీలలో విజయవాడ తుమ్మలపల్లి  కళా క్షేత్రంలో విజయవంతంగా నిర్వహించి   "జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు" నిర్వహణా బాధ్యతలను జిల్లా కలెక్టర్ లక్ష్మీశా  కలిమిశ్రీకి అప్పగించడం చాలా గొప్ప విషయంగా కొందరు భావిస్తున్నారు. అయితే, ఆ ఉత్సవాల నిర్వహణకు అత్యంత సమర్థుడు, అర్హుడు కలిమిశ్రీ అన్నది నా భావన. ప్రపంచంలోని సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు, ప్రభుత్వం కూడా కలిమిశ్రీ సాహితీ సేవలను గుర్తించవలసి ఉంది. కలిమిశ్రీ సాహిత్యం కోసం చేస్తున్న కృషిని మంగళగిరి సాహితీ కళావేదిక వారు గుర్తించి, ఆయనను సముచిత రీతిన గౌవించినందుకు వారికి నా అభినందనులు.

- శిరందాసు నాగార్జున

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...