Dec 8, 2022

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పోరాటాల వేదికగా సామాజిక మాధ్యమాలు

గత కొన్ని నెలలుగా ప్రైవేట్ రంగంలోని మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీలుస్టార్టప్‌లు భారీ స్థాయిలో తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో వేలాది మంది భారతీయ యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోంది. అయితే, వీరు గతంలో మాదిరి కాకుండా దీనిపై పోరాడేందుకు సమాయత్తమవుతున్నారు. అత్యధిక మందిని తొలగిస్తుండటంతో వారు కూడా ఉద్యమాల బాట పట్టక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.   ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది మంది యువతీ-యువకులు తమ మేనేజ్‌మెంట్లతో ఏ విధంగా వ్యవహరించాలో,  దేశంలోని కార్మిక చట్టాలుకార్మిక హక్కులపై చర్చిస్తున్నారు. గతంలో వామపక్షాలకు చెందిన ట్రేడ్ యూనియన్లు ఇటువంటి ఉద్యమాలలో కార్మికులు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో కీలక భూమికను పోషించాయి. శరవేగంగా పెరిగిన సాఫ్ట్ వేర్ రంగంలో వారు చొచ్చుకుపోలేకపోయారు. అంతేకాకుండా, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు అత్యధికంగా పేకేజీలు, సౌకర్యాలు, ఆరోగ్య బీమాలు ... వంటివి ఉండటంతో వారు కూడా ట్రేడ్ యూనియన్లను పట్టించుకోలేదు. అంత అవసరం కూడా వారికి రాలేదు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి తరువాత అనేక మార్పులు వస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం, ఉద్యోగులను తొలగించడం వంటి కొనసాగుతున్నాయి. దాంతో ఉద్యోగులు ఆందోళన చెందవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారికి ఇప్పటి వరకు కార్మిక, ఉద్యోగ ఉద్యమాలతో సంబంధంలేదు. ఒక్కసారిగా వాటి అవసరం ఏర్పడింది.  ఎడ్టెక్బైజూస్ లాంటి సంస్థలు వందలాది ఉద్యోగులకు  ఉద్వాసన పలికాయి. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సగం కంటే ఎక్కువ మంది సిబ్బందిని తొలగించింది. ఫేస్‌బుక్ మాతృ సంస్థయైన మెటా 87వేల మంది ఉద్యోగులను తొలగించింది. అంటేఇది మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతంగా ఉంది.

తొలగింపుల పరంపరతో ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విదేశాలలోని వారి సహచరుల వలె తమ అసంతృప్తిని తెలిపేందుకు ఇంటర్నెట్ లను ఆశ్రయిస్తున్నారు. ఆన్ లైన్ నెట్‌వర్క్‌ లను తయారుచేసుకుంటూ యాజమాన్యాలపై తమ పోరాటాన్ని ఎక్కుపెడుతున్నారు. ఉద్యోగాల తొలగింపుపై సహోద్యోగులను కూడగట్టి వారి హక్కులను కాపాడుకునేందుకుపాత్రికేయులకు సమాచారాన్ని అందిచేందుకు వాట్సాప్స్లాక్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం వరకు కంపెనీలు తమ ఉద్యోగుల పనితీరు సరిగా లేకపోతే తొలగించేవారు.  కానీ,  నేడు పనితీరుతో సంబంధం లేకుండా ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణం అయిపోయింది. ఈ పరిణామాలను చూస్తుంటే ఉద్యోగం నుంచి తొలగించడం ఆమోదించిన వ్యాపార పద్ధతిగా మారిపోయిందని విశ్లేషకులు అంటున్నారు.  

ట్రేడ్ యూనియన్‌లు మునుపటిలా శక్తివంతంగా లేవు. ఇటువంటి సందర్భంలో ఉద్యోగులకు సామాజిక మాధ్యమాలే తమ పోరాటాలకు వేదికగా మారుతున్నాయి. ఉధ్వాసనకు గురైన ఉద్యోగులకు సామాజిక మాధ్యమాలు ఎంతవరకు ఉపయోగపడుతాయో లేదో తెలియదు గాని ఉద్యోగులను ఐక్యం చేయడంలోనిరసనలకు ఊపందించడంలో మాత్రం అవి కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.  దేశంలో లక్షలాది మంది కార్మికులు నేటికీ ట్రేడ్ యూనియన్లలో ఉన్నప్పటికీమొత్తంగా ట్రేడ్ యూనియన్ల ఉద్యమం సంవత్సరాలుగా బలహీనపడిందనే చెప్పాలి.  పెరుగుతున్న ప్రైవేట్ రంగ ఉద్యోగాలుకొత్త కార్మిక సంస్కరణలుకాంట్రాక్టు పనుల పెరుగుదలతో సహా అనేక ఇతర అంశాలు ట్రేడ్ యూనియన్ల అస్తిత్వాన్ని రోజురోజుకు తగ్గించేశాయి. యాజమాన్యాలు తమ వ్యాపారాలను విస్తరించుకోవడంలో సామాజిక మాధ్యమాలు ఎంతగా ఉపయోగపడుతున్నాయో ఉద్యోగుల పోరాటాల్లో సైతం కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో సాంప్రదాయకంగా యాజమాన్యాలకు-ఉద్యోగులకు మధ్యవర్తిత్వ వహించే యూనియన్ల అవసరాన్ని సామాజిక మాద్యమాలు తగ్గించేశాయి. రేషనలైజేషన్ పేరుతో 2,500 మంది ఉద్యోగులను తొలగిస్తామని బైజూస్ అక్టోబరులో ప్రకటించిన తర్వాత ఉద్యోగులు మీడియా ముందుకు వచ్చి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ఉద్వాసనకు గురైన ట్విట్టర్ ఉద్యోగులు తమ అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అనేక మంది ఉద్యోగులు తమ బాధలను చెప్పుకోవడానికితమ హక్కుల పోరాటం కోసం ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు.

 

 తిరువనంతపురంలో తమను బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపిస్తూ 140 మంది బైజూస్ ఉద్యోగులు నిరసనకు దిగారు. కేరళ మంత్రిని కలిసి తమ ఉద్వాసనపై దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత తిరువనంతపురంలో తమ కార్యకలాపాలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు  బైజూస్ ప్రకటించింది. ఆ రకంగా సామాజిక మాద్యమాలు ఉద్యమాలకు ఫలవంతమైన వేదికగా తయారయ్యాయి.

-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

-     గుమ్మడి ప్రభాకర్, రాజకీయ, సామాజిక విశ్లేషకులు -9441278295 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...