Oct 18, 2022

హిజాబ్ మత వివాదం కాదు హక్కులు,స్వేచ్ఛ సమస్య

కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం  దేశమంతా వ్యాపించి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. మతాచారాలు, సంప్రదాయాలు, మనోభావాలకు సంబంధించిన ఈ సున్నితమైన అంశం పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వాలు,వర్గాలు, మతాల మధ్య చిచ్చుకు దారితీసింది. కర్ణాటక  ఉడిపి జిల్లాలోని ఓ జూనియర్ కాలేజీకి    కొందరు ముస్లిం విద్యార్థినులు ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో హిజాబ్ ధరించి రావడంతో  ఈ వివాదం మొదలైంది. ఆ తరువాత కాలేజీలో  హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను  తరగతులకు అనుమతించలేదు. అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 5న కర్ణాటక ప్రభుత్వం ఏకంగా కాలేజీల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఈ  వివాదం మరింత ముదిరింది. ఉడిపి జిల్లా నుంచి కర్ణాటకలోని ఇతర  ప్రాంతాలకు, క్రమంగా దేశవ్యాప్తంగా వ్యాపించింది. ప్రతి రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టారు. హిజాబ్ ధరించడం  తమ మత ఆచారమని ముస్లింల వాదన. వాస్తవానికి ఇది మతానికి సంబంధించిన అంశమైనప్పటికీ, వివాదం మాత్రం మతాల మధ్య కాకుండా రెండు వర్గాల మధ్యే తలెత్తింది. రెండు వర్గాల వారూ  ఆందోళనకు దిగారు. నిరసనలు, విద్యార్థుల సస్పెన్షన్, ధర్నాలు, ఆందోళనలు, పోలీస్ కేసులు, అరెస్టులు.. పెద్ద దుమారమే చెలరేగుతోంది.

హిజాబ్ ధరించడం ముస్లిం విద్యార్థినులకు  రాజ్యాంగం ప్రసాదించిన హక్కని  కొందరు   కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని, ప్రభుత్వ జీవోను సమర్థిస్తూ  మార్చి 15న సంచలన తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.దాంతో ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.  దీనిని సుప్రీం కోర్టులోని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం  10 రోజులు విచారించింది. ఈ ధర్మాసనం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఈ నెల 13న  ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం  విద్యార్థినులు తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను  రద్దు చేస్తూ జస్టిస్ ధూలియా తీర్పు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు  తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు.చివరకు ఈ వివాదంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌కు నివేదించారు. ఈ వివాదంపై  ప్రధాన న్యాయమూర్తి  త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నారు. రెండు వర్గాల మధ్య వివాదం రెండు మతాల మధ్య చిచ్చుకు దారి తీసింది. ఇరు మతాల వారు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.తాము రెండు, మూడు పెళ్లిళ్లు  చేసుకుంటామని అంటారని,  అయితే, తాము  రెండు పెళ్లిళ్లు  చేసుకున్నా ఇద్దరు భార్యలకు గౌరవంగా చూస్తామని ఏఐఎంఐఎం ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు  షౌకత్‌ అలీ  చెప్పారు. కానీ, హిందువులు ఒకరినే వివాహం చేసుకుని, మరో ముగ్గురు ఉంపుడుగత్తెలను ఉంచుకుంటారని, భార్యకు గానీ, ఉంపుడుగత్తెలకు గానీ గౌరవం ఇవ్వరని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.   

 వాస్తవానికి ఇది మతం సమస్యకాదు. హక్కుల సమస్య.   ఇస్లాంలో  హిజాబ్ తప్పనిసరా? ముస్లింలు అందరూ హిజాబ్ ధరిస్తారా? అన్న ప్రశ్నలు ఇక్కడ ముఖ్యం కాదు. ఈ వివాదం పూర్తిగా మహిళల హక్కులకు సంబంధిచినదే.  ఎందుకంటే ఇరాన్‌లో బహిరంగ ప్రదేశాలలో  మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని అక్కడి ప్రభుత్వం చట్టం చేసింది. దానిని అక్కడ మహిళలు వ్యతిరేకిస్తున్నారు. హిజాబ్ ను వ్యతిరేకిస్తూ  ఇరాన్‌లో  మహిళలు రోడ్డెక్కారు. దేశంలోని  అత్యధిక  నగరాల్లో  నిరసనలు కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 35 మంది మృతి చెందారు.వందలాది సామాజిక కార్యకర్తలను, రాజకీయ ప్రత్యర్థులను  పోలీసులు అరెస్టులు చేశారు.ఇదే సమయంలో  కాలేజీల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ  భారత్‌లో కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇక్కడి ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఇరాన్‌లోని మహిళలు తాము హిజాబ్ ధరించం అని ఆందోళనలకు దిగినే, ఇక్కడ భారత్‌లోని విద్యార్థినులు తాము హిజాబ్ ధరిస్తామని ఆందోళనలు చేస్తున్నారు. అక్కడ, ఇక్కడ నిరసలు, ఆందోళనలు చేసేవారు ముస్లింలే. ఇది కొందరికి విచిత్రంగా అనిపించినా, ఇరుదేశాల మహిళలు హక్కుల గురించే మాట్లాడుతున్నారు. తమ హక్కులకు, స్వేచ్ఛకు ప్రభుత్వాలు భంగం కలిగిస్తున్నాయనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

హిజాబ్‌ను ధరించడం, ధరించకపోవడం మహిళల ఇష్టాఇష్టాలకు, స్వేచ్ఛకు సంబంధించిన అంశమని వారు వాదిస్తున్నారు. వారికి, వీరికి ఇద్దరికీ మనదేశంలోని మహిళా హక్కుల కార్యకర్తలు మద్దతు పలుకుతున్నారు. ఈ చర్యలు మహిళల హక్కులను హరించడమేనని వారు పేర్కొంటున్నారు. ఇరాన్‌లో ఇస్లాం పేరుతో మహిళలపై బలవంతంగా హిజాబ్‌ను రుద్దడం, భారత్‌లో యూనిఫామ్ పేరుతో ముస్లిం విద్యార్థినులు  హిజాబ్ ధరించకూడదని చెప్పడం  ప్రభుత్వాలు మహిళలను నియంత్రించడానికి చేసే ప్రయత్నాలలో భాగమేనని మండిపడుతున్నారు. మహిళలు ధరించే దుస్తులపై ప్రభుత్వాల నియంత్రణ ఏమిటని అడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇప్పుడు అందరి దృష్టి సుప్రీం కోర్టువైపే ఉంది. ఇక్కడ ఈ సమస్యకు పరిష్కారం చూపవలసిన బాధ్యత దేశ అత్యున్నత న్యాయస్థానంపై ఉంది. 

                                                                  - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్టు. 944022914                                                                     

\


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...