Oct 14, 2022

హిందీ భాషపై దుమారం

దక్షిణాదిన తీవ్ర నిరసన

విద్యావేత్తల ఆందోళన

హిందీ భాషపై మళ్లీ దుమారం చెలరేగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన  అధికార భాషలపై గత నెలలో  జరిగిన   పార్లమెంట్‌  కమిటీ సమావేశంలో  మొత్తం 112 సిఫార్సులతో  కూడిన ప్రతిపాదనలను రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. 1963 అధికార భాషల చట్టం ప్రకారం 1976లో ఏర్పడిన ఈ కమిటీలో 20 మంది లోక్‌సభ సభ్యులు, పది మంది రాజ్యసభ సభ్యులు మొత్తం 30 మంది ఎంపీలు ఉంటారు. సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు   ఐఐటీ, ఐఐఎం,ఎయిమ్స్,  టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యాసంస్థలన్నింటిలోనూ హిందీని తప్పనిసరి చేయాలని, కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో   హిందీ మీడియం మాత్రమే ఉండాలని ఈ కమిటీ సూచించింది.  ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంగ్లీషు స్థానంలో  హిందీని తప్పనిసరి చేయాలని కూడా సిఫారసు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కోర్టు తీర్పులు... మొదలైన అన్నిటిలోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు  హిందీ భాషలోనే జరగాలని నివేదించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంగ్లీషును అనుమతించాలని, ఆ ప్రాంతాల్లో కూడా క్రమంగా ఇంగ్లీషు స్థానంలో హిందీని భర్తీ చేయాలని ప్రతిపాదించింది.  ప్రభుత్వ ఆహ్వాన పత్రికలు, ఉపన్యాసాలు అన్నీ హిందీలోనే ఉండాలని సూచించింది.  ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాషకు ప్రాచుర్యం లభించినందున ఐక్యరాజ్య సమితి అధికార భాషల్లో దీనిని చేర్చాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. 

అన్నిటికంటే ముఖ్యంగా దేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రాంతాలను ఈ కమిటీ మూడు భాగాలుగా విభజించింది. హిందీ మాట్లాడే రాష్ట్రాలు బీహార్,మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్,  రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులను ఏ గ్రూప్‌లో చేర్చింది. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, చండీఘర్, దమన్ అండ్ డయూ, నాగర్ హవేలీలను బీ గ్రూప్‌లో, మిగిలిన వాటిని సీ గ్రూప్‌లో చేర్చింది. హిందీ మాట్లాడేవారిని ఏ గ్రూప్ లో చేర్చడం  వివాదానికి దారి తీసింది. మిగతా భాషలు మాట్లాడేవారిని ద్వితీయ పౌరులుగా చూస్తారన్న భావన కలుగుతోందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ విభజనకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

 ఈ కమిటీ సిఫారసులు వివాదాస్పదమయ్యాయి.  హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాల వారు, ముఖ్యంగా దక్షిణాదివారు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కమిటీ సిఫారసులను అమలు చేయడం అంటే అన్ని ప్రాంతీయ భాషలను ఒక్క వేటుతో తుదముట్టించడమేనని పేర్కొంటున్నారు. ఈ ప్రతిపాదనలు మాతృభాషలకు ముప్పు కలిగించే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కర్ణాటకలోని చిత్రదుర్గలో  భారత్​ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  ఈ విషయమై స్పందించారు. భాష అనేది ఓ విశ్వాసం, ఓ భావన, భాషలో ఓ చరిత్ర ఉంటుందని, ప్రతి రాష్ట్రానికీ తమ ప్రాంతీయ భాషను ఉపయోగించుకునే హక్కు ఉందని తెలిపారు.  విద్యార్థులు తమకు తెలిసిన భాషలో పరీక్షలు రాయడానికి  అనుమతించాలని రాహుల్ చెప్పారు.

 
భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు ప్రతీకగా నిలిచే భారత్‌లో ఏ ఒక్క భాషనైనా ఇతర భాషల కంటే ఎక్కువ చేసినా అది దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తూ  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల భాషలను అధికార భాషలుగానే  కేంద్రం పరిగణించాలని, హిందీని తప్పనిసరి చేసే ప్రయత్నం చేయొద్దని డీఎంకే అధినేత,  తమిళనాడు సీఎం స్టాలిన్‌  ప్రధానిని కోరారు.  దేశంలో  హిందీ భాషను మాట్లాడని వారే ఎక్కువ మంది ఉన్నారన్న విషయం  గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రం తన ప్రయత్నాలను విరమించుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని స్టాలిన్ హెచ్చరించారు. మరో సారి హిందీ వ్యతిరేక ఉద్యమం రావాలని తాము  కోరుకోవడం లేదని  డీఎంకే ఎంపీ కనిమొళి స్పష్టం చేశారు. హిందీని అభివృద్ధి చెందని రాష్ట్రాల భాషగా  డీఎంకేకు చెందిన మరో ఎంపీ ఇళంగోవన్ పేర్కొన్నారు.పశ్చిమబెంగాల్, గుజరాత్,మహారాష్ట్ర,తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో హిందీ మాతృభాషగా లేదన్నారు. 

 హిందీ భాషను బలవంతంగా రుద్దితే దేశం ముక్కలవుతుందని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎఎస్ అళగిరి  కేంద్రాన్ని హెచ్చరించారు.బీజేపీ పాలనలో హిందీని అధికార భాషగా రుద్దేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. ఇటువంటి ప్రయత్నాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. భారత్‌కు జాతీయ భాష అంటూ ఏదీ లేదని, ఇతర అధికారిక భాషల మాదిరిగానే హిందీ కూడా ఓ అధికారిక భాష మాత్రమేనని  తెలంగాణ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హిందీని  రాష్ట్రాలపై రుద్దడం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. 

రాజకీయ పార్టీల నేతలే కాకుండా విద్యావేత్తలు కూడా ఈ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోటీ ప్రపంచాన్ని తట్టుకొని ఉద్యోగాలు సంపాదించాలన్నా, ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఇంగ్లీష్  తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. ఇంగ్లీష్‌లో  కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే యువత మనుగడ కష్టమని, హిందీని రుద్దడమంటే భావి పౌరుల జీవితాలతో ఆడుకోవడమేనన్న భావన వారిలో నెలకొంది. ప్రాంతీయ భాషలకు, మాతృభాషలకు ప్రాధాన్యత కలిగిన  భిన్నత్వంలో ఏకత్వం గల  మన దేశంలో ఇలాంటి నిర్ణయాల వల్ల విద్యా,ఉపాధి పరంగా ఇబ్బందులు తలెత్తడమేకాకుండా  ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914


 


 


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...