Oct 26, 2020

భార్య లేని భర్త పరిస్థితి

 భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు. అలుగుతారు. తిడతారు. కొందరు ప్రబుద్ధులైతే నానా ర‌కాలుగా చిత్ర‌హింస‌లు పెడ‌తారు.  అన్నింటినీ భరించే భార్యను ‘టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌’గా తీసుకుంటారు!! ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం.. తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు! ‘ఆమె’ లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం!! అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ ఆమె విలువ తెలుసుకోలేని మగానుభావులు.. ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక.. అందరితో కలవలేక.. మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు!!        

                                                                                                                                                     ‘‘నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే.. పచ్చటి చెట్టుకింద కూర్చుని చెబుతున్నా. ‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు. ఆ తర్వాత నా సంగతి చూడు’ అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని. ‘మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా?’ అనుకోకు. వుంటారు. నాకు మీ మావయ్యంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది. చీకటంటే భయం. ఉరిమితే భయం. మెరుపంటే భయం. నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు? అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు?’’...ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది!                                                 

   నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక  కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు.                                                                                                                                                  ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం.. భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిపోయిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు.                                                                                                                                                                                                        దాంపత్యం అంటే.:- రెండు మనసుల కలయిక. మరణం ఆ బంధాన్ని వేరు చేస్తే.. ఓ భాగస్వామి దూరమైతే.. మిగిలి ఉన్నవారి మనసు కకావికలమవుతుంది. స్త్రీ, పురుషులెవరికైనా ఆ బాధ ఒకటే. కానీ శేషజీవితాన్ని గడపడంలో మాత్రం తేడాలు కనపడతాయి. భర్త దూరమైనా భార్య తట్టుకుని జీవించగలదు. కానీ.. పురుషులు కుటుంబ సభ్యులతో కలిసిపోలేరు. మానసికంగా ఒంటరులైపోతారు. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి.   

కావాల్సింది సహకారం.. వ్యాపకం:- కొన్ని కుటుంబాలను పరిశీలిస్తే భార్య గతించి ఏళ్లు గడిచినా ఉత్సాహంగా ఉన్నవారు ఉన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే.. ‘నా వయసు 90 ఏళ్లు. నా భార్య ఎన్నో ఏళ్ల క్రితమే మరణించింది. కొడుకు, కూతురు రమ్మన్నారు. కానీ, వెళ్లాలని అనిపించలేదు. అందుకే మా వూరిలో ఉన్న ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నా. ఆధ్యాత్మిక సేవలోనే గడుపుతున్నాను. ఇప్పుడు ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండటంతో అమ్మాయి ఇంటికి వచ్చేశా. ఆ భగవంతుడి పిలుపుకోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ ఓ పెద్దాయన చెప్పుకొచ్చారు. 

‘నా వయసు 92 ఏళ్లు. భార్య పాతికేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి నా కోడలు నన్ను కన్న తండ్రిలా సాకుతోంది. సాయంత్రంపూట గుడికి వెళ్లి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తాను. ఖాళీగా ఉండకుండా పుస్తకాలు చదవుతుంటాను, రాస్తుంటాను’ అని చెప్పుకొచ్చారు రఘురామ్‌ అనే మరో వృద్ధుడు.                           

  అధ్యయనంలోనూ అదే తేలింది:-  2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. అందులో ఒక ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. అదేంటంటే.. భర్తను కోల్పోయిన మహిళలతో పోలిస్తే, భార్యను కోల్పోయిన పురుషులు త్వరగా చనిపోయే అవకాశం 30 శాతం ఎక్కువని! భర్త చనిపోతే బాధ ఉంటుంది గానీ.. దాన్ని తట్టుకోగలిగే మానసిక స్థైర్యం మహిళలకు ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనంలో తేలింది. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. తన కన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట. భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారు.  

ఇలా చేస్తే కొంత బెటర్‌:-

1.చిన్నపిల్లలతో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించటం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు. వారి ఆటపాటలు.. చిలిపి చేష్టలు వయసు మళ్లిన వారికి ఆనందాన్ని కలిగించటమే కాదు.. తమ చిన్న తనం నాటి సంఘటనలను జ్ఞప్తికి తెచ్చి మరింత హుషారుగా మార్చేస్తాయి.

 2. వయసు పెరుగుతున్న కొద్దీ తమకంటూ ఒక ప్రపంచం ఉండాలి. ఎందుకంటే ఓ వయసు వచ్చిన తరువాత బయట సంబంధాలు తగ్గిపోతాయి. కుటుంబంలో కూడా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఆఖరికి మనవళ్లు, మనవరాళ్లు కూడా వారి ప్రపంచంలో వారుంటున్నారు. అందుకే తమ దైన ప్రపంచం సృష్టించుకోవాలి. అది తమ అభిరుచులకు తగినట్లుగా ఉండాలి. ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన హాబీ ఉండి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు, ఇతర కారణాల వల్ల ఆ హాబీని మూలన పడేసి ఉండొచ్చు. దాన్ని పైకి తీస్తే కాలక్షేపం అవుతుంది. 

3. లాఫింగ్‌ క్లబ్‌ లాంటి వాటిలో చేరటం లేదా సమాజసేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల ఫలితం ఉంటుంది. 

4. స్నేహితులు, బంధువులతో తరచూ మాట్లాడటానికి ప్రయత్నించాలి. కొత్త స్నేహాలకు చేయిచాచాలి. ఇలాంటి వాటివల్ల కాస్తంత ఉపశమనం కలిగి బాధ నుంచి తేరుకునే శక్తి వస్తుంది.       

ఆధారపడడమే కారణం:- సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని.. తాను తప్ప ఆమెకు దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు. భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. భార్య దగ్గర ఉన్న స్వతంత్రం కొడుకు, కోడళ్ల వద్ద ఉండదు. దానికి తోడు వయోభారం. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అన్నీ కలిసి కుంగుబాటుకు దారితీస్తాయి. నాణేనికి మరోవైపు చూస్తే.. భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తగ్గించుకోవడం కారణంగా ఆరోగ్యంగా పూర్తి జీవితాన్ని గడపగలుగుతారని విశాఖ జీజీహెచ్‌ మానసిక వైద్యులు మురళీ కృష్ణ విశ్లేషించారు.                                                            

మహిళలే స్వతంత్రులు:- స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురుచూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. ఆ మనోబలమే... భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది.- ప్రొఫెసర్‌ రాజు, ఏయూ, సైకాలజీ     

 భావోద్వేగ బలం ఆమెదే:- పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, స్త్రీ భావోద్వేగాలప రంగా  బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే.. ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...