Dec 7, 2019

దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు
           
            మరో వందేళ్లు గడిచినా భారతదేశంలో రిజర్వేషన్లను తొలగించే పరిస్థితి వచ్చే అవకాశం లేదు.  అంటే దేశంలో సామాజిక అసమానతలు తొలగిపోతాయని ఊహించడానికి కూడా అవకాశంలేని విధంగా పరిస్థితులు ఉన్నాయి.  ఆర్థిక అసమానాతలు ఎటూ సాధ్యం కాదు. భారత దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన ఆక్స్ ఫామ్ అనే స్వచ్చంద సంస్ధ నివేదిక ప్రకారం 2016 నాటికి ఆర్థికంగా అత్యంత ఉన్నత స్ధానంలో ఉన్న(బిలియనీర్లు) ఒక శాతం సంపన్నుల చేతుల్లో దేశానికి చెందిన మొత్తం సంపదలో 58 శాతం పేరుకుపోయింది. ఆర్థికంగా దిగువ స్థాయి నుంచి ఉన్న 70 శాతం మందికి చెందిన సంపదకు ఇది సమానం. కేవలం 84 మంది బిలియనీర్ల వద్ద దాదాపు రూ.17,36,000 కోట్ల విలువైన సంపద ఉంది. బిలియనీర్ల సంఖ్య 2017లో 101కి పెరిగింది. బిలియనీర్లు పెరుగుతున్నారంటే ఆర్థిక వ్యవస్థ బలపడినట్లు కాదు. సంపద అతి కొద్దిమంది వద్దకే చేరుతోంది. ఆక్స్‌ ఫాం సర్వే ప్రకారం 2017లో దేశంలోని 73 శాతం సంపద ఒక్క శాతం మంది అత్యంత ధనవంతుల వద్దకు చేరింది. దేశంలోని దాదాపు సగం అంటే 67 కోట్ల మంది సంపద ఒక్క శాతం మాత్రమే పెరిగింది. దేశ ఆదాయం పెరుగుతోంది. కాని పేదల సంఖ్య పెద్దగా తగ్గడంలేదు.  ఆర్థిక అసమానాతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాజిక పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. కులాల మధ్య సామాజిక అసమానతలు కనీసం తగ్గుతాయన్న  నమ్మకం కూడా కలగడంలేదు. అంత బలీయంగా భారత సమాజంలో  కుల వ్యవస్థ వేళ్లూనుకుంది. కుల వివక్ష విలయం తాండవం చేస్తోంది. భారత రాజ్యంగ నిర్మాతలలో కీలకమైన మహోన్నత వ్యక్తి అంబేద్కర్, రాజ్యంగ సభ సభ్యుడు నాగప్ప వంటి వారు రాజ్యాంగంలో రిజర్వేషన్ల కోసం పొందుపరిచిన పదేళ్ల సమయం సరిపోదని ఆనాడే భావించారు. అయితే మరో పదేళ్లలో అంటే 20 ఏళ్లలో సమాజం మారిపోతుందని, సమ సమాజం ఏర్పడుతుందని వారు అనుకొని ఉండవచ్చు. ఇన్నేళ్లైనా వీసమంత మార్పు కూడా రాదని వారు ఊహించి ఉండరు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్లు దాటిపోయినా ఇంకా  రిజర్వేషన్లు కొనసాగించవలసిన పరిస్థితులే ఉన్నాయి. పార్లమెంటు, శాసన సభల్లో షెడ్యూల్డు కులాలు, తెగల రిజర్వేషన్లను మరో పది సంవత్సరాలు పొడిగించాలన్న ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన  డిసెంబర్ 4, 2019న జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం ఆమోదించింది. పొడిగించుకుంటూవచ్చిన రిజర్వేజన్ల కాల పరిమితి 2020 జనవరి 25తో ముగుస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం పార్లమెంటులో ఎస్సీలు 84 మంది, ఎస్టీలు 47 మంది ఉన్నారు. వివిధ రాష్ట్రాల శాసన సభల్లో 614 ఎస్సీ సభ్యులు, 554 మంది గిరిజనులు ఉన్నారు. ఈ సమాజంలో ఇంకా వారికి రిజర్వేషన్ల అవసరం ఉందని భావించిన మంత్రి మండలి 2030, జనవరి 25 వరకు పొడిగించాలని నిర్ణయించింది.  కుల వ్యవస్థలో సామాజిక మార్పు రవ్వంత కూడా రాలేదు. పైగా ఆయా కులాల వారు రిజర్వేషన్ ఫలితాలను సంపూర్ణంగా పొందలేకపోతున్నారు.
              దేశంలోని  ఐఐఎంలలో అధ్యాపకుల  నియామకాలలో సామాజిక న్యాయం ఎంతవరకు పాటిస్తున్నారనే అంశంపై ఐఐఎం పూర్వ విద్యార్థులు కొందరు ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించారు.  ఆ సమాచారం ద్వారా ఐఐఎంలలో దాదాపు 97 శాతం మంది శాశ్వత సిబ్బంది ఒకే కులానికి చెందినవాళ్లు ఉన్నారని తేలింది.  దేశ జనాభాలో ఆ కులం వాళ్లు కేవలం 5 లేదా 6 శాతం మంది మాత్రమే ఉంటారు.  వారి అధ్యయనం ప్రకారం దేశంలోని 13 ఐఐఎంలలోని 642 సిబ్బందిలో ఒకరు ఎస్టీ, నలుగురు ఎస్సీలు కాగా, బీసీలు 17 మంది మాత్రమే ఉన్నారు. దేశంలోని మొత్తం 20 ఐఐఎంలలో 90 శాతం మంది ఫ్యాకల్టీ సభ్యులు జనరల్ కేటగిరీ వారే ఉన్నట్లు మరో పరిశీలనలో తేలింది. మన రాష్ట్రంలో  ఏపీపీఎస్సీ కూడా ఉద్యోగ నియామకాలలో బీసీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడంలేదు. ఈ విషయంలో బీసీ సంఘాల వారు ఆందోళనలు చేస్తున్నారు. బీసీ కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు.  కొంతమంది ఆదిపత్యం చలాయించడం వల్ల  వారు నష్టపోతున్నారు.  తమకు రిజర్వేషన్ కావాలనే కులాలు, మతాలు పుట్టుకొస్తున్నాయి. అంటే దేశంలో సామాజిక పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
            రాజ్యాంగ నిపుణులకు కూడా అందనంత పటిష్టంగా, బలంగా కుల వ్యవస్థ, వివక్ష ఈ సమాజంలో పాతుకుపోయాయి. సామాజికంగా కుల వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి, సామాజిక అసమానతలు తొలగించడానికి  ఏ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయడంలేదు. రాజకీయంగా కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు. మరో పదేళ్లు, మరో పదేళ్లు పొడిగించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యవస్థలో ఎందుకు మార్పు రావడంలేదో తెలుసుకోవడానికి గానీ, మార్పు తీసుకురావాలన్న ప్రయత్నాలు గాని జరగడంలేదు. రాజకీయ లబ్ది కోసం  కాలపరిమితిని పొడిగించుకుంటూ వస్తున్నారు. వాస్తవ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మన దేశంలో అమలు జరిగే రిజర్వేషన్లలో ప్రధానంగా  మూడు రకాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ రిజర్వేషన్ (రిజర్వ్‌ డ్ నియోజకవర్గాలు), రెండు చదువులు, మూడు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 334 ప్రకారం రాజకీయ రిజర్వేషన్‌కు మాత్రమే పదేళ్ల కాల పరిమితి ఉంది. చదువు, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కోసం రాజ్యాంగం ఎలాంటి కాలపరిమితిని విధించలేదు. రాజ్యాంగ నిపుణులు భారతీయ వ్యవస్థ మూలాలను ఔపోసన పట్టి ఉంటారు. అందువల్లే వాటికి కాలపరిమితి విధించ ఉండరు. రాజకీయ రిజర్వేషన్లను ఏ ప్రభుత్వమైనా తప్పనిసరిగా అమలు చేస్తోంది.  విద్యా, ఉద్యోగాలలో  మాత్రం వారు ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. అగ్ర కులాల ఆధిపత్యం కొనసాగుతోంది.  అక్కడ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడంలేదు. వాటిని సరైన రీతిలో అమలు చేయించుకోగలిగిన స్థితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు లేరు.  తమకు రావలసిన వాటిని రిజర్వేషన్ వర్గాల వారు కొట్టుకుపోతున్నారన్న భావనతో అగ్ర కుల యువత ఉంటోంది. ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వారు సామాజిక వివక్ష, కటిక దారిద్య్రం అనుభవించారని, ఈ ఆధునిక యుగంలో కూడా వారు ఇంకా అదే రీతిలో జీవిస్తున్నారన్న విషయం వారికి విడమరిచి చెప్పేవారు లేరు. ప్రభుత్వంలో మాత్రమే రాజ్యాంగం కల్పించిన ఈ రిజర్వేషన్ల ద్వారా వారు లబ్ది పొందుతున్నారు. ప్రైవేటు రంగంలో వ్యాపారాలు, ఉద్యోగాలు 95 శాతానికి పైగా అగ్ర కులాల వారే ఆక్రమించారు. ఇక్కడ వారి ప్రావీణ్యతను, నైపుణ్యాన్ని, మేథో సంపదని కించపరచడంలేదు. వేల సంవత్సరాలు అణచివేతకు గురైన వర్గాల వారు వారీతో సమానంగా ప్రావీణ్యతను, నైపుణ్యాన్ని, మేథో సంపదని పొందే స్థితిలో లేరని, సామాజిక వివక్ష తొలగిపోలేదని, ఆర్థికంగా వారు బలహీనులని  తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆర్థిక, సామాజిక అసమానతలు  పెరగడం ప్రమాదకరం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...