Nov 2, 2022

విశ్వవిద్యాలయాలతో నా అనుబంధం


 సోమవారం(31.10.2022) నేను అమరావతిలోని విట్(వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) యూనివర్శీటీకి వెళ్లాను. మా బంధువుల అమ్మాయికి కన్వీనర్ కోటాలో అక్కడ సీటు వచ్చింది. ఆ అమ్మాయిని చేర్చడానికి వెళ్లాను. ఇదేమిటి స్మశానంలో యూనివర్శిటీ అనుకుంటున్నారా? ఇది నిజంగా ప్రపంచ ర్యాంకింగ్ యూనివర్సిటీయే. గ్రాఫిక్ కాదు. ఇందులో కనిపించేవి  నిజమైన భవనాలే. ఇక్కడ దెయ్యాలు గట్రా తిరగవు. ఇక్కడ రెండు వేల మందికి పైగా విద్యార్థులు, వారికి బోధించే అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.  మన దేశంలోని నలుమూలకు చెందిన వారే కాకుండా విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు.  ఇది నిజమైన యూనివర్శిటీయే అని మీరు నమ్ముతున్నారని నాకు తెలుసు. ఆ విషయం వదిలివేయండి.

 నేను ఒక యూనివర్సిటీని చూస్తే పొందే ఆనందం వేరు.  తాజ్‌మహల్, తిరుపతి వెంకటేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడుని చూసినా అంతగా ఆనందించను. యూనివర్శీటీ అంటే నాకు అంత ఇష్టం. నా దృష్టిలో యూనివర్శిటీ అంటే అత్యంత పవిత్రమైనది, అత్యంత గొప్పది. అద్వితీయమైనది. దానికి మించినది మరొకటిలేదన్నది నా అభిప్రాయం. అది చాలా విస్తృతమైనది, ఆదో విశాల ప్రపంచం. యూనివర్శిటీ అంటే నాకు చిన్నప్పటి నుంచి గొప్ప భావన ఉంది. ఎందుకో తెలియదు.  చిన్నప్పుడు ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆరవ తరగతితోనే చదువు ఆపేయవలసి వచ్చింది. నాకు చదువంటే చాలా ఇష్టం. హైస్కూల్ చదువులు ఆపేసినా పుస్తకాలు విపరీతంగా చదివేవాడిని.  అప్పటి నుంచే నాకు లైబ్రరీ కార్డు ఉండేది. అదీ ఇదనిలేదు అన్ని పుస్తకాలు చదివేవాడిని. అంబేద్కర్, హిట్లర్, లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, వేమన... వంటివారి జీవితచరిత్రలు, చరిత్ర, షేక్సియర్ నాటికలు, బెంగాలి నవలలు, చలం, బుచ్చిబాబు, కొడవటిగంటి, కోడరి కౌసల్యాదేవి, యుద్దనపూడి సులోచనారాణి, రంగనాయకమ్మ,  శ్రీశ్రీ, బాలగంగాధర్ తిలక్, మార్కిజం.... ఇలా అన్ని రకాల పుస్తకాలు చదివేవాడిని. వీటన్నిటికంటే ముఖ్యమైనది మాది మంగళగిరి. నేను మంగళగిరిలో పుట్టిపెరగడం వల్ల కూడా యూనివర్శిటీ ఇష్టపడటానికి ఓ ముఖ్య కారణంగా భావిస్తాను. అదేంటనుకుంటున్నారా? మంగళగిరి ఓ గొప్ప పుణ్యక్షేత్రం. అందులో అనుమానం అవసరంలేదు.   ఇక్కడ లక్ష్మీనరశింహస్వామి, పానకాల స్వామి, గండలయస్వామి... వంటి వారు ఉన్నారు. ఆధ్యాత్మికంగా మంగళగిరికి మంచి చరిత్ర, గుర్తింపు ఉన్నాయి. అలాగే మంగళగిరి అంటే ఉద్యమాల గడ్డ. కమ్యునిస్టులకు కంచుకోట. ఒకప్పుడు లేండి.ఇప్పుడు కాదు.  ఇక్కడ కమ్యునిస్టులు, ర్యాడికల్స్, నక్సలైట్లు, యూసీసీఆర్ఎంఎల్....వంటి కమ్యునిస్టు గ్రూపులన్నికిటి చెందిన వారు ఉండేవారు.  నాస్తిక ఉద్యమాలు, హేతువాద ఉద్యమాలు గడ్డ ఇది.  అంతా చేనేత కార్మిక వర్గమే. నా చిన్నప్పుడు మంగళగిరిలో 80 శాతం మంది చేనేతవారే ఉండేవారు. పది వేలకు పైగా చేనేత మగ్గాలు ఉండేవి.  నేను వాళ్లందరి మధ్యలో పెరిగాను. అలా నాకు ఆ బుద్ధులే అబ్బుతాయి. అబ్బాయి. భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు, చార్వాక విద్యాపీఠం ప్రిన్సిపాల్ బొడ్డు రామకృష్ణ  నా పెళ్లికి పురోహితుడు( కత్తి పద్మారావు గారి పెళ్లికి కూడా ఆయనే పురోహితుడు), ఇక ముఖ్య అతిధులు వేములపల్లి శ్రీకృష్ణ, నిమ్మగడ్డ రామ్మోహనరావు వంటి వారు. ఇక నా భావాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా పెరగడం వల్ల నాకు దేవాలయాల మీదకంటే విశ్వవిద్యాలయాలపైనే ఆరాధనా భావం ఎక్కువ. సాధారణంగా భక్తులు దేవాలయాలకు వెళితే, గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మరీ దేవుడికి దణ్ణం పెట్టుకుంటారు. అక్కడ మనకు ఎవరూ తెలిసిన వారు ఉండరు. అర్చకుడు గానీ, దేవాలయ సిబ్బంది గానీ మనకు తెలియదు. అలా అని దేవుడు మనకు తెలుసు అనుకోవద్దు. దేవుడు కూడా మనకు తెలియదు. అయినా, అలా ప్రదక్షణ చేస్తాం. నేనూ అలాగే, ఒక విశ్వవిద్యాలయానికి వెళితే, అక్కడ నాకు ఎవరూ తెలిసిన వారు లేకపోయినా, అంతా కలియ తిరిగి భవనాలు, తరగతి గదులు,అక్కడి వాతావరణాన్ని చూసి ఆనందిస్తాను. ఏ విశ్వవిద్యాలయానికి వెళ్లినా అలాగే చూస్తాను.  నాకు అప్పటికీ, ఇప్పటికీ విశ్వవిద్యాలయం అంటే అదే పవిత్రభావం ఉంది. 
నా చిన్నప్పుడు నాకు దగ్గరలో విశ్వవిద్యాలయం ఏదీ లేదు. 

 ఆరవ తరగతితో చదువు మానివేసిన తరువాత నేను చేయని పనిలేదు. మా పెద్దమ్మ ముత్యమామ్మతో కలిసి  నిడమర్రు  మిరపకాయ కోతలకు, గోంగూర కోతలకు వెళ్లాను. తరువాత ఇటుకలు మోశాను. ఆ తరువాత కార్పెంటర్ పనికి, ఎలక్ట్రిక్ పనికి వెళ్లాను. చివరకు త్రిపురమల్లు గుర్నాథం  చిల్లరకొట్లో నెలజీతానికి చేరారు. అక్కడ నుంచి తాతా రామయ్య అండ్ సన్స్ అనే తౌడు కొట్టులో చేరారు. అక్కడ చేరిన తరువాత నాకు పుస్తకాలు చదవడానికి బాగా సమయం దొరికేది. అప్పుడే ఎక్కువ పుస్తకాలు చదివాను. అది తాతా వెంకటేశ్వర్లు బ్రదర్స్ గా, అ తరువాత తాతా వెంకటనారాయణ అండ్ కోగా మారాయి. అక్కడ చాలా కాలం పని చేశాను. ఇప్పటికి కూడా వారితో  నా సంబంధాలు బాగానే ఉన్నాయి. మధ్యలో కొంత కాలం నేత నేశాను.   తౌడు కొట్టులో పనిచేసే సమయంలో నేను తరచూ మద్రాస్ (ఇప్పుడు చెన్నై) వెళుతుండేవాడిని. ఎంత తచూ అంటే నెలకు రెండుసార్లు కూడా వెళ్లేవాడిని. తమిళనాడులోని తిరువళ్లూరు, రెడ్ హిల్స్ లలో తౌడు కొనడానికి వెళ్లేవాడిని. అలా వెళ్లినప్పుడల్లా ఏవైనా వస్తువులు కొనడానికి పారిస్, చైనా బజార్ కు వెళుతుండేవాడిని. అలా వెళ్లినప్పుడు  ఒక సారి యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్ చూడటానికి వెళ్లాను. అప్పుడు దానిని చూసి ఎంత ఆనందించానో చెప్పలేదు. నేనూ ఓ యూనివర్శిటీని చూశాను.  ఆ యూనివర్శిటీకీ ఒక చరిత్ర ఉంది. మనదేశంలో పురాతన కాలంలోనే నలంద, తక్షశిల వంటి చోట్ల గురుకులాలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచం అంతటా ఆధునిక విశ్వవిద్యాలయాలు  ఏర్పడే సమయంలో మనదేశంలో  బ్రిటీష్ వారి కాలంలో 1857లో మూడు యూనివర్శిటీలను కలకత్తా, ముంబై, మద్రాస్‌లలో ఏర్పాటు చేశారు. యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్ అప్పుడు ఏర్పాటు చేసిందే. ఆ విధంగా ఎంతో చరిత్ర కలిగిన   యూనివర్శిటియే  నేను మొదట చూసిన యూనివర్శిటీ. 
ఆ తరువాత నేను నేత నేస్తున్న సమయంలో మా ఊరికి దగ్గరలోనే నాగార్జున యూనివర్శిటీ ( ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని  1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. మంగళగిరి నుంచి నేను ఒక్కడినే (అప్పట్లో నా మిత్రులకు ఇటువంటి విషయాలపై ఆసక్తి ఉండేది కాదు. వారు పక్కా చేనేత కార్మికులు) సైకిల్ వేసుకుని ఆ కార్యక్రమానికి వెళ్లాను. నాగార్జున యూనివర్శిటీ ప్రారంభోత్సవాన్ని కళ్లారా చూశాను. ఆనందించాను. ఎంతో ఉత్సాహంగా అదే ఊపుతో సైకిల్ తొక్కుకుంటూ మంగళగిరి వచ్చాను.   సరిగ్గా పది సంవత్సరాల తరువాత 1986లో అదే యూనివర్శిటీ  కేంపస్‌లో నేను లా విద్యార్థిగా చేరాను. అప్పుడు  నేను ఎంత ఆనందించి ఉంటానో మీరే ఊహించుకోండి.

ఆరవ తరగతితో చదువు ఆపేసి లాలో ఎలా చేరాడని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. నేను నేత నేసే సమయంలో చదువు పట్ల నాకు ఉన్న ఆసక్తి చూసి కందుల రామచంద్రరావు(రాము మాస్టర్) అనే మాస్టర్  1978లో నాచేత మెట్రిక్ పరీక్షలు రాయించారు. ఆయన ఉచితంగా చదువు చెప్పడమేగాక, ఆయనకు తెలిసినవారితో తెలుగు, మాథ్స్ చెప్పించారు.  నాకు తెలిసిన దేవుడు ఆయన.
నాతోపాటు మరో పేద విద్యార్థి నెమలిపురి రామరాజుకు కూడా ఆయన ఉచితంగా చదువు చెప్పారు. ‘‘ఇద్దరూ సెప్టెంబరుకు పరీక్షలు రాయండి. తప్పితే మళ్లీ మార్చిలో  రాద్దురు’’ అని మా మాస్టర్ చెప్పారు.  మేం ఇద్దరం ఎలాంటోళ్లమనుకున్నారు. సెప్టెంబరుకే పాసైపోయాం. మా రాజు ఆ తరువాత లారీ డ్రైవర్ అయి, ఆర్టీసీ డ్రైవర్ గా రిటైర్ అయ్యాడు.   నా చదువు దాహం తీరేది కాదు. నేను మాత్రం ఏదో పని చేసుకుంటూ ఇంటర్ లో చేరిపోయాను. తరువాత డిగ్రీలో చేరాను. డిగ్రీలో ఫీజు 130 రూపాయలు. నా వద్ద అంత డబ్బులేదు. సగం కట్టి సగం కాలేజీకి అప్పు పెట్టాను. అప్పటి కాలేజీ ప్రిన్సిపాల్ అందే రామమోహన రావు గారు ఎవరికీ చెప్పవద్దు. మిగిలిన డబ్బు తరవాత కట్టమన్నారు. ఆయన రిటైర్ అయిపోయారులెండి, ఇప్పడు చెప్పినా పరవాలేదు. సెలవుల్లో తౌడు కొట్లో పని చేస్తూనే డిగ్రీ పూర్తి చేశాను. యూనివర్సిటీ కేంపస్ లో చదవాలనేది నా కోరిక.  ఇండియాలో ఏ యూనివర్శిటీలో సీటు వస్తే అక్కడ చేరదాం అనుకున్నాను. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ లా ఎంట్రన్స్ రాశాను. సీటు వచ్చిందని పోస్టు కార్డు పంపారు. వెళ్లాను. నాన్ లోకల్ అన్నారు. సీటు ఇవ్వలేదు. మరి కార్డు ఎందుకు పంపారో తెలియదు.  చాలా బాధపడ్డాను. ఆ తరువాత 1986లో రాష్ట్రవ్యాప్తంగా మొట్టమొదటి సారిగా లా ఎంట్రన్స్ టెస్ ప్రవేశపెట్టారు. రాశాను. నాగార్జునా యూనివర్శిటీ కేంపస్ లో సీటు వచ్చింది. చేరాను. ఆ యూనివర్శిటీ ప్రారంభోత్సవానికి హాజరయ్యాను. అదే యూనివర్శిటీలో చేరాను. చాలా ఆనందించాను.  ఉదయం దినపత్రికకు విలేకరిగా, ఆ తరువాత ఆంధ్రభూమి దినపత్రికలో సబ్ ఎడిటర్ గా చేస్తూ  1989లో లా పూర్తి చేశాను. 1990లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో విశాఖపట్నంలో చేరాను. అక్కడ ఆంధ్రా యూనివర్శిటీ ఉంది. ఒక రోజు వెళ్లి చూశాను. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లు ఆంధ్రాయూనివర్శిటీ మొత్తాన్ని కలియతిరిగాను. ఇంక ఆలస్యం దేనికి ఇందులో చేరాలని అనుకున్నాను. జర్నలిజం ఎంట్రన్స్ రాశాను. సీటు వచ్చింది.  1993లో బ్యాచిలర్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్(బీజేఎంసీ)లో చేరాను. పూర్తి చేశాను.   5వ ర్యాంక్ వచ్చింది.  ఆ తరువాత మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్(ఎంజేఎంసీ) ఎంట్రన్స్ రాశాను. సీటు వచ్చింది. చేరాను. అది కూడా 1995లో  5వ ర్యాంక్‌తో పాసైయ్యాను.  ఇక్కడో విషయం చెప్పాలి. అప్పటికి మంగళగిరిలో జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేసిన మొదటి వ్యక్తిని నేనే.   అంతటితో ఆపలేదు. ఆ తరువాత జర్నలిజంలో పీహెచ్‌డీలో చేరడానికి ఎంట్రన్స్ రాశాను. సీటు వచ్చింది. స్కాలర్‌గా చేరాను. కానీ, ఉద్యోగ రీత్యా ఒంగోలు, కడప, అనంతపురం వెళ్లడం వల్ల పూర్తి చేయలేకపోయాను. దాంతో యూనివర్శిటీలతో నా అనుబంధం తెగిపోయింది. ఇక్కడో విషయం చెప్పాలి. చిన్నప్పుడు నాతో నేత చేసిన నా మిత్రులకు గానీ, తెలిసినవారికి గానీ చాలా మందికి నేను బీఎల్ చేసినట్లు గానీ, ఎంజేఎంసీ చేసినట్లు గానీ ఇప్పటికీ తెలియదు. నేనూ ప్రత్యేకంగా చెప్పను. ఏదో చదువుకుని జర్నలిస్టు అయ్యాడని మాత్రం అనుకుంటారు. 

ఇంతటితో యూనివర్శిటీల కథ ఆగలేదు. ఇక మా  పిల్లలు కూడా యూనివర్శిటీ కేంపస్‌లో చదవాలనేది నా కోరిక. నా కోరిను మా అమ్మాయి చైతన్య నెరవేర్చింది.  మా అబ్బాయి భరత్ మాత్రం బీటెక్ తో ఆపేశాను. ఎంటెక్ చేయలేనని చెప్పాడు.  ఇక్కడ మళ్లీ యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్ గురించి మాట్లాడుకోవాలి. 2007లో అనుకుంటా, ఆ యూనివర్శిటీని ప్రారంభించి 150 సంవత్సరాలు పూర్తి అయింది. ఆ సందర్భంగా ఆ యూనివర్శిటీ అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఆ సంవత్సరం నేను చెన్నైలోని అంబత్తూరులో  ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపులో పని చేస్తున్నాను. అప్పడు మా అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసింది.  దాంతో  అక్కడ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కు ఎంట్రన్స్ రాయమని చెప్పాను. రాసింది. సీటు వచ్చింది, ఫీజు కట్టడానికి రమ్మని యూనివర్శిటీ వారు లెటర్ పంపాను. చాలా ఆనందంతో మా అమ్మాయిని తీసుకు యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్‌కు వెళ్లాను. నాకు ఉస్మానియాలో జరిగిన విధంగానే మా అమ్మాయికి అక్కడ జరిగింది. నాన్ లోకల్ సీటు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. అయితే, అక్కడ ఓ అధ్యాపకుడు మా అమ్మాయికి సీటు ఇవ్వడానికి ప్రయత్నించారు. సీట్లు ఉన్నాయి, ఇద్దామని అక్కడి బాధ్యులకు కూడా చెప్పారు. కానీ, అక్కడి బాధ్యుడుకి తెలుగు వాళ్లంటే గిట్టనట్లుగా కనిపించింది నాకు. సీటు ఇవ్వడానికి ఇష్టపడిన అధ్యాపకుడు చాలా ప్రయత్నించారు. నాకూ కొంత ఆశ కలిగింది. కానీ ఇవ్వలేదు. బాధపడుతూ తిరిగి వచ్చాను.  అయితే, నా మనసులోని ఆలోచన మా అమ్మాయికి తెలియదు. నేనూ చెప్పలేదు. మా అమ్మాయి మాత్రం ‘‘పోతే పోనీలే డాడీ, మరో యూనివర్శిటీ చూసుకుందాం’’ అంది. అప్పటికే    పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీకి,  ఏపీలో ఎంట్రన్స్ రాసింది. పాండిచేరిలో కేవలం రెండు ర్యాంకుల తేడాతో సీటు రాలేదు. ఏపీలో పద్మావతి, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల్లో ఎంబీఏలో సీట్లు వచ్చాయి.  శ్రీకృష్ణదేవరాయలో చేర్పించాను. ఆ విధంగా మా అమ్మాయి కూడా యూనివర్శిటీ కేంపస్ లోనే ఎంబీఏ పూర్తి చేసింది. ఇదండి యూనివర్శిటీలకు, నాకు ఉన్న సంబంధం. ఇంతటితో ఆగుతుందో లేదో నేను చెప్పలేను. ఇప్పటికి మాత్రం ఇదే.   విట్ యూనివర్శిటీని సందర్శించిన సమయంలో ఇవన్నీ గుర్తుకు వచ్చాయి.  మీతో పంచుకున్నాను. 
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...